Family: ప్రతి మగాడి జీవితంలో చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక ఆడదాని సాయం కచ్చితంగా ఉంటుంది. ఆమె అమ్మ కావచ్చు, ఆమెనే అర్ధాంగి కావచ్చు. స్థానం మారిన ఆమెకున్న స్థాయి మారదు. పేరు మారిన ఆమె మనకోసం చేసే త్యాగం మారదు. జీవితంలో చాలా మంది సాధారణంగా చేసే తప్పులు రెండు ఉంటాయి. అందులో ఒకటి అమ్మని వదిలేయడం. అమ్మ ప్రేమని మరిచిపోవడం. రెండోది అర్ధాంగిని బంధించడం, ఆమె స్వేచ్ఛని హరించడం. ఈ రెండు జీవితంలో చాలా ప్రమాదకరమైనవి.
ఒక మగాడి జీవితం అద్భుతంగా మారాలంటే ఎప్పటికి ఈ రెండింటిని వదిలేయకూడదు అనేది ఇతిహాసాలలో మహర్షుల నుంచి నవీన యుగంలో జీవిత సత్యాన్ని అర్ధం చేసుకునే మేధావుల వరకు అందరూ చెప్పే మాట. తొమ్మిది నెలలు గర్భంలో మోసి, ప్రాణం పోయే పురిటి నొప్పులు భరించి మనకి ప్రాణం పొసే అమ్మకి ప్రేమించడం తప్ప ఇంకేం తెలుస్తుంది. కానీ ఆమె ప్రేమతో పెరిగిన మగాడు పెళ్లి అయిన వెంటనే వచ్చే భార్య ప్రేమలో మునిగిపోతాడు. ఆ సమయంలో వాడికి అమ్మ ప్రేమ కంటే అర్ధాంగిగా వచ్చిన అమ్మాయి ప్రేమ గొప్పగా అనిపిస్తుంది. అలా అనిపించడంలో తప్పేమీ లేదు. అనిపించలేదంటేనే మనలో ఇంకేదో లోపం ఉన్నట్లు.
కానీ అమ్మని వదిలేసి, కన్న అమ్మ ప్రేమని మరిచిపోయే మగాడికి అర్ధాంగి ప్రేమ ఎక్కువ కాలం రుచించదు. ఎందుకంటే వారికి ప్రేమించడం చేతకాదు, ప్రేమని అర్ధం చేసుకునేంత జ్ఞానం ఉండదు. అందుకే గడుస్తున్న కాలంతో పాటు సమాజం ఉచ్చులో, గూడు కట్టుకుపోయిన పురుషాహంకార ధోరణిలో కొట్టుకుపోతూ అర్ధాంగిగా ఉన్న ఆమెని నియంత్రించాలని అనుకుంటాడు. ఆమె స్వేచ్ఛకి సంకెళ్లు వేసి నాలుగు గోడల ప్రపంచంలో బంధించే ప్రయత్నం చేస్తాడు. అయితే కొడుకు ఆలోచన ఎలా ఉన్న కన్నతల్లి కాబట్టి భరిస్తుంది. కానీ భర్త ఆలోచన ఎలా ఉన్న భరించేంత సహనం భార్యకి ఉండదు. మారుతామని ఎదురుచూస్తుంది. మార్చాలని ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఒంటరిగా వదిలేసి పోతుంది.
భర్త అనే పెత్తనాన్ని భరించడానికి తరువాత ఆ మగాడి జీవితంలో ఎవరూ ఉండరు. మగాడు అనే అహంకారాన్ని భరించడానికి మరో అర్ధాంగి దొరకదు. ఆపై ఏ మగాడి జీవితం అయినా ఏకాకి ప్రయాణమే. అన్ని కోల్పోయిన ఒంటరి జీవితమే అవుతుంది. ఆడవారి ప్రేమని అర్ధం చేసుకోలేకపోతే ఏ మగాడి జీవితం అయినా ఇలాగే మారుతుంది. తన ప్రాణాలు ఇచ్చి మనకి ప్రాణం పోసేంత ప్రేమ ఉన్న ఆ కన్నతల్లిని ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవాలి. తనకున్న అందరిని వదులుకొని మనకోసం తన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన అర్ధాంగి ప్రేమని ప్రతి క్షణం మనం గౌరవించాలి.
అమ్మ కోరుకునేది ఓ చిన్న గుర్తింపు, అర్ధాంగి కోరుకునేది కాస్తంత గౌరవం. ఈ రెండు ఇవ్వగలిగేంత ఆలోచన మనకుంటే అందమైన ఓ కుటుంబం మనకుంటుంది. చివరి ఘడియ వరకు సంతోషకరమైన జీవితం దొరుకుంటుంది. భిన్నమైన రెండు ఆలోచనలు ఉన్న మగాళ్లు ఈ చిన్న కథలో ఉన్నారు. అందులో మీరు ఎక్కడున్నారో అర్ధం చేసుకోండి. మీ జీవితం ఎలా ఉందో అవగతం అవుతుంది. ఇకపై మారడం, మారకపోవడం మీ ఇష్టం.