Spiritual: భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. దేవాది దేవతలు ఆలయాలు వేల సంఖ్యలో మన భారత ఖండంలో ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి పూజలందుకుంటున్న ఆలయాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. శైవ సాంప్రదాయంలో శివాలయాలు, మహాశక్తి ఆలయాలు, వైష్ణవ సాంప్రదాయంలో మహావిష్ణు అవతారాలకు సంబంధించిన ఆలయాలు పూజలు అందుకుంటున్నాయి.
సాక్షాత్తు దేవతలు కట్టించిన ఆలయాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే రాక్షసులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాలు అయితే గ్రహాంతరవాసులు నిర్మించారని కూడా కథలుగా చెప్పుకునే వారు ఉన్నారు. ఇదిలా ఉంటే దెయ్యాలు నిర్మించిన దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ మహాదేవుడి ఆలయంలో శివుడు సుందరేశ్వరుడుగా పిలవబడుతున్నారు. కర్ణాటకలో బెంగళూరు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఈ సుందరేశ్వర ఆలయం ఉండటం విశేషం.
పూర్వకాలంలో ఆ గ్రామంలో దెయ్యాల సంచారం ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామస్తులు ఆలోచించి శివాలయం నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని భావించి ఆలయం నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ఆలయ నిర్మాణంలో దెయ్యాలు అవాంతరం సృష్టించి పూర్తికాకుండా అడ్డుపడేవి. దీంతో గ్రామస్తులు ఒక మాంత్రికుని ఆశ్రయించారు. మాంత్రికుడు కాళికా ఉపాసన చేసి అన్ని దెయ్యాలను బంధించాడు. దీంతో దెయ్యాలు దారికి వచ్చి తమను విడిచి పెట్టాలని కోరుకున్నాయి. అయితే ఆలయాన్ని నిర్మిస్తే విడిచి పెడతానని మాంత్రికుడు కండిషన్ పెట్టడంతో దెయ్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి.
కొంతకాలం పాటు ఆలయంలో గ్రామస్తులు ఎలాంటి శివలింగాన్ని ప్రతిష్టించి లేదు. తర్వాత ఆలయ సమీపంలో ఉన్న ఒక మంచి నీళ్ల బావిలో శివలింగం వారికి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి సుందరేశ్వరుడుకి ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక భూతాలు నిర్మించిన ఆలయం కావడంతో ఆ టెంపుల్ గోడలపై దెయ్యాల విగ్రహాలు కనిపిస్తాయి. అన్ని ఆలయాల కంటే విచిత్రంగా ఈ ఆలయం ఉండడం విశేషం. ఈ ఆలయంలో మహా దేవుని భూతనాథుడుగా కూడా అక్కడి వారు కొలుస్తారు. ఎవరికైనా దెయ్యాలు పడితే ఈ ఆలయానికి తీసుకొస్తే వదిలేస్తాయి అని స్థానికుల నమ్మకం.