Tholi Ekadashi: మన హిందువులకు పండుగలు అన్ని తొలి ఏకాదశి తోనే ప్రారంభమవుతాయి. ప్రతి ఏడాది తొలి ఏకాదశి పండుగను ఆషాడ మాసంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున రైతులందరూ కూడా ఎంతో ఘనంగా పూజలు జరుపుకొని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా తొలి ఏకాదశి రోజున విష్ణు దేవుడు యోగనిద్రలోకి వెళ్లి కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి రోజు ఈ నిద్ర నుంచి బయటకు వస్తారని పండితులు చెబుతున్నారు.
ఇలా ఎంతో విశిష్టమైన ఈ ఏకాదశి రోజున ఉపవాస నియమాలను పాటిస్తూ శ్రీహరి హరి హరిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఈ ఏడాది ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి సమయం ఏంటి, అసలు ఏకాదశి రోజు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే…హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది.
ఉదయతిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. బుధవారం ఉదయమే తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఈరోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ధనం ధాన్యం దానం చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. ఇక శ్రీహరికి సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా సమర్పించాలి. ఈరోజు ఉపవాసం ఎంతో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.