Vijay Antony : తమిళ స్టార్ హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగునాట ఫేమస్ అయ్యాడు. ఈ ఒక్క సినిమాతో విజయ్ ఆంటోనీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి తమిళంలో మనోడి సినిమాలు మంచి హిట్ టాక్ తో ఆడుతున్నాయి. రీసెంట్ గా బిచ్చగాడు2 కూడా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు విజయ్ తుఫాన్ సినిమాతో మారోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ లో త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మన హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. గత మూడు నెలలుగా తాను చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్ లో కూడా చెప్పులు వేసుకోకూడదని డిసైడ్ అయ్యానని తెలిపాడు. అయితే చెప్పులు వేసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంలో తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన కెరీర్ లో వచ్చిన బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తుఫాన్ సినిమాతో మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నాడు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌లో ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు విజయ్ మిల్టన్. జూన్ లో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ క్రమంలో లేటెస్టుగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
ఇక విజయ్ ఆంటోని తుఫాన్ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి చెప్పులు లేకుండా రావడంతో అందరి దృష్టి వాటిపైనే పడ్డాయి. దాంతో మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా? అని మీడియా హీరోని అడిగింది. దీంతో ఆంటోనీ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ” నేను ఎలాంటి దీక్ష చేయడం లేదు. గత 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఒకరోజు నేను చెప్పులు లేకుండా నడిచాను. అది నాకు బాగా నచ్చింది. ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిదనిపించింది. అంతేకాదు నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. అందుకే జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని అనుకుంటున్నా” అని విజయ్ అంటోని చెప్పారు.
ఇక తుపాన్ టీజర్ అద్భుతంగా ఉంది. ఒక నిమిషం 23 సెకండ్లు ఉన్న ఈ టీజర్ నిడివి గల ఈ టీజర్ ఆధ్యంతం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. కొన్ని జీవితాలు తక్కువనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఈ మూవీ. ప్రస్తుతం తుఫాన్ షూటింగ్ చివరి దశలో ఉంది. మూవీ షూటింగ్‌ను ఎక్కువగా అండమాన్, డయ్యూ డమన్‌లలో జరిపారు.ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తోంది. సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్, కన్నడ హీరో డాలి ధనంజయ, సీనియర్ నటులు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.