Ramoji Rao : ఈనాడు గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న రామోజీరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు గుర్తించిన డాక్టర్లు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో ట్రీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున 4గంటల 50 నిమిషాలకు కన్నుమూశారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయన అసలు పేరు రామయ్య. కానీ స్కూల్లో చేరినప్పుడు తన పేరు రామోజీరావు అని చెప్పి ఆ పేరే రాయించుకున్నారు. గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు. 1974 ఆగస్టు 10న విశాఖ నగరంలో ఈనాడు పత్రిక ప్రారంభించారు. ఆ తర్వాత సినీ పత్రిక సితార తీసుకొచ్చారు. కాలక్రమంలో రామోజీ మార్గదర్శి చిట్ ఫండ్, ఈటీవీ నెట్‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్ స్థాపించారు. హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
1983లో రామోజీ ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అనేక తెలుగు చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు తీశారు. 1996లో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. దాదాపు 2వేల ఎకరాల్లో విస్తరించిన ఈ స్టూడియోలో ఒకేసారి 15 నుంచి 25 సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సినిమాలే కాకుండా, ఇదో టూరిస్ట్ ప్లేస్ కూడా. ఏటా దాదాపు 10 లక్షల మందికిపైగా పర్యాటకులు రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తారు.
టీవీ ప్రపంచంలో రామోజీరావుది చెరగని ముద్ర. భారత్ లో ప్రాంతీయ టీవీ ఛానెల్‌లను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. ఈటీవీ.. మీటీవి అంటూ 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రామోజీ.. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీని విస్తరించారు. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు. జర్నలిజం స్కూల్ నిర్వహిస్తూ ఏటా పదుల సంఖ్యలో జర్నలిస్టులను తయారు చేస్తున్నారు. వినోద రంగాల్లోనూ తెలుగువారిని ఈటీవీ ఛానళ్లు అలరించాయి. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మీడియా, జర్నలిజం ప్రపంచానికి రామోజీ చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించారు. అంతకు ముందు1985లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మూవీ తెలుగు, 1998లో ఫిల్మ్‌ఫేర్ స్పెషల్ అవార్డు, 2000లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మూవీ తెలుగు, 2004లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారు. సింప్లిసిటీని ఇష్టపడే రామోజీ.. వైట్ హాఫ్ స్లీవ్ షర్ట్, వైట్ ప్యాంట్, వైట్ షూలో మాత్రమే కనిపించేవారు. రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ 2012 సెప్టెంబర్ 7న లుకేమియాతో చనిపోయారు.
రామోజీ మరణంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్రవేశారని. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని ప్రశంసించారు. రామోజీ రావు మరణంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. రామోజీరావు మృతి పట్ల భారాస అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.