Technology: సాంకేతిక యుగంలో ప్రస్తుతం మానవ సమాజం ఉంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎన్నో రకాల సేవలని మనం రోజువారి జీవితంలో వినియోగించుకుంటూ ఉన్నాం. ఫోన్ కాల్స్ నుంచి డిజిటల్ లావాదేవీ నిర్వహించే స్థాయికి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ డెవలప్ అయిపోయింది. అలాగే వీడియో కాల్ సర్వీస్ చాలా అడ్వాన్స్ లోకి వెళ్లిపోయింది. ఇలా చాలా రకాలుగా స్మార్ట్ ఫోన్ మన దైనందిన జీవితంలో భాగం అయిపొయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వలన ఎంత ఉపయోగం ఉందో అంతే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కొంత మంది సైబర్ నేరగాళ్ళు ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశని అవకాశంగా చేసుకొని వారి చేతితోనే వారి డబ్బులు దోచేస్తున్నారు. అలాగే సీక్రెట్ ఫోటోలని తస్కరించి వాటితో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతు న్నారు. అలాగే ప్రస్తుతం రకరకాల యాప్స్ ని మన అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం. అయితే ఈ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకునే క్రమంలో మన ఫోన్ మీద సర్వ హక్కులు వారికి ఇచ్చేస్తున్నాం. ఫోన్ డేటా, గేలరీ, కెమెరా, మెసేజ్, జీపీఎస్ సర్వీస్ ఇలా అన్నింటిని యాక్సస్ చేసుకోవడానికి యాప్స్ కి పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. అయితే ఇలా పర్మిషన్ ఇవ్వడం వలన చాలా యాప్స్ మన ప్రైవేట్ ఫోన్ కాల్స్ ని కూడా ఆటోమేటిగ్ గా వింటున్నాయి.
ఇలా వింటూ ఫోన్ లో మనం ఆడే సంభాషణలకి అనుగుణంగా ప్రకటనలు ఇవ్వడానికి యాడ్ కంపెనీలకి డేటాని అమ్ముకుంటున్నాయి. తాజాగా ఈ వివరాలని లోకల్ సర్కిల్ సర్వే ప్లాట్ ఫార్మ్ వెల్లడించింది. వారి సర్వే ప్రకారం ఫోన్ సంభాషణల రిలేటెడ్ గా ఉండే యాడ్స్ ని తమ ఫోన్స్ లో వస్తున్నాయని 53% మంది వెల్లడించారు. చాలా యాప్స్ మైక్రో ఫోన్ యాక్సస్ అడుగుతున్న విషయం కూడా తమకి తెలియదనే విషయాన్ని తెలిపారు.
అయితే ఫోన్ సంభాషణలకి ఆ డేటానుగుణంగా యాడ్స్ రావడం స్మార్ట్ ఫోన్ యూజర్స్ ని ఆందోళనకి గురిచేస్తుంది. అసలు తమ స్మార్ట్ ఫోన్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోలేక వారు సతమతం అవుతున్నారు. ఇలాంటివి కంట్రోల్ కావాలంటే ప్రభుత్వం పర్సనల్ ప్రొటక్షన్ బిల్లుని తీసుకొస్తేనే సాధ్యం అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లలో డేటా నియంత్రణ జరగకపోతే నేరాలు మరింత ఎక్కువ అయిపోతాయని లోకల్ సర్కిల్ వ్యవస్థాపకులు రాజేష్ తపారియా అంటున్నారు.