Spirtual: దైవానికి, మనుషులకి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. మనిషి మనుగడ ఉన్నంత కాలం దేవుడు అనే విశ్వాసం ఈ అనంత విశ్వంలో ఉంటూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలైన ఉండొచ్చు, ఎంత మంది ఎన్ని రకాలుగా దేవుడిని ఆరాధించిన అందరి నమ్మకం ఒకటే. కనిపించని అదృశ్య శక్తి ఏదో ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తుంది. శాసిస్తుంది. ఆ శక్తి రూపమే భగవంతుడు.
అతనికి ఎవరు ఏ రూపం ఇచ్చుకున్న నిరాకారతత్వంలో ఉండే ఆ భగవంతుడు ఆ రూపంలో వారికి దర్శనం ఇస్తాడని ప్రజల నమ్మకం. ఇక ఇండియాలో అయితే వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. అలాగే హిందూమతంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. వారిలో చాలా మందికి ఆలయాలు ఉన్నాయి. ఎక్కువగా శైవ, వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చిన ఆలయాలు కనిపిస్తాయి. ఆలయాలు ఎన్ని ఉన్న ప్రతి ఆలయంలో దేవుడికి, మనకి మధ్య వేదాలని అభ్యసించిన పండితుడు లేదా బ్రాహ్మణుడు ఉంటాడు.
ఆలయానికి వెళ్ళే సమయంలో మన తరుపున ఆ పురోహితుడు దేవుడికి పూజలు, అభిషేకాలు చేస్తాడు. మన సంకల్పాన్ని నేరవేర్చమని భగవంతుడికి మంత్రోచ్చారణ ద్వారా నివేదిస్తాడు. అలా నివేదించిన తర్వాత తీర్ధాన్ని ప్రసాదంగా ఇవ్వడంతో తలమీద శఠగోపం పెట్టి ఆశీర్వదిస్తాడు. అయితే ఈ శఠగోపం ప్రత్యేకత ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు ఇది ఎందుకు పెడతారు అనేది కూడా అవగాహన లేదు. ఆలయంలో పూజారి తలపై పెడుతున్నాడు.
దర్శనం కోసం వెళ్ళిన మనం పెట్టుకుంటున్నాము ఇంతవరకే చాలా ఎవరిని అడిగిన చెబుతారు. అయితే శఠగోపంపెట్టడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది అని వేదపండితులు చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం, గోపం అంటే గోప్యత. మన ఆలోచనలు, మనస్సులో ఉండే చెడు, మూర్ఖత్వం వంటి లక్షణాలని భగవంతుడి సన్నిధిలో త్యజిస్తున్నామని ఆ దేవుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని చెప్పడానికి శఠగోపం తలపై పెట్టుకుంటారు. అలాగే మనలో ఉండే ఆ చెడు లక్షణాలని భగవంతుడు దూరం చేస్తాడని, నాది అనే భావనని తొలగించి వాస్తవం తెలియజేయడానికి శఠగోపంపెడతారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
అలాగే తల మీద శఠగోపం పెట్టాక మొక్కుకుంటే కోర్కెలని భగవంతుడి పాదాలకి నమస్కరించి కోరికున్నట్లే అనే భావన కూడా ఇందులో ఉంది. ఈ శఠగోపం పంచలోహాల మిశ్రమాలతో తయారు చేస్తారు. శఠగోపం తలపై పెట్టినప్పుడు ఆ లోహాశక్తి మన శరీరంలోకి ప్రవేశించి చెడు భావనల్ని దూరం చేస్తుందని కూడా చెబుతారు.