Categories: Most ReadMoviesNews

RRR: ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా రివ్యూ

RRR: ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 25.03.2022
నటీనటులు: రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, ఆలియా భట్, ఓలివియా, శ్రియ, సముద్రఖని తదితరులు
సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫీ: కెకె. సెంథిల్ కుమార్
ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
కథ: కె.వి. విజయేంద్రప్రసాద్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచం మొత్తం ఔరా అనిపించిన రాజమౌళి నుండి చిత్రం వస్తుందంటే ఉండే క్రేజే వేరు. అందులో ఈసారి ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ అని ప్రకటించగానే.. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. మరోసారి జక్కన్న.. ప్రపంచంపై ‘ఆర్ఆర్ఆర్’ అస్త్రాన్ని సంధించబోతున్నాడంటూ టాక్ మొదలైంది. మధ్యమధ్యలో హీరోలకు సంబంధించిన ప్రోమోలు వదులుతూ.. ఆసక్తిని మరింత పెంచుతూ వచ్చారు. ఇక ట్రైలర్ వదిలిన తర్వాత డౌటే లేదు.. తెలుగోడి సత్తా ఏంటో.. మరోసారి ప్రపంచానికి తెలియబోతుంది అనేది సుస్పష్టమైంది. అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మధ్యలో కోవిడ్ రూపంలో పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. సినిమాపై ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. ఇక విడుదల తేదీ ఫిక్స్ అయ్యాక.. ఈసారి రావడం పక్కా అన్న తర్వాత రాజమౌళి, చరణ్, తారక్ త్రయం చేసిన పబ్లిసిటీ కూడా ఈ సినిమాని నిత్యం వార్తల్లో నిలిచేలా చేసింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని నేడు(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని అందుకుందో? రాజమౌళి మరోసారి ఎటువంటి మ్యాజిక్ చేశారో? చరణ్, తారక్‌లు వెండితెరపై ఎలా బీభత్సం సృష్టించారో? మన రివ్యూలో తెలుసుకుందాం.

RRR movie review

కథ:

కథగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు.. ఒక చిన్న పాయింట్ అంతే. 1920 నాటి కాలంలో బ్రిటీష్ గవర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌సన్).. ఆదిలాబాద్ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తాడు. అక్కడ గోండు జాతికి చెందిన మల్లి అనే పాపని వాళ్లతో పాటు దిల్లీకి తీసుకెళ్లిపోతాడు. గోండు జాతికి కాపరి అని పేరున్న భీమ్(తారక్).. ఆ పాపని తిరిగి తీసుకువచ్చేందుకు దిల్లీకి పయనమవుతాడు. అదే బ్రిటీష్ ప్రభుత్వం లో విశాఖకి చెందిన రామరాజు(రామ్ చరణ్) పోలీసు అధికారిగా పనిచేస్తుంటాడు. తన మరదలు సీత(ఆలియా)కు ఇచ్చిన మాట కోసం పవర్ ఫుల్ అధికారిగా పేరు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో పాపని తీసుకురావడానికి వెళ్లిన భీమ్‌కి రామరాజు ఎలా సహాయం చేశాడు? స్నేహితులుగా మారిన వారిద్దరి మధ్య వైరానికి కారణం ఏమిటి? మల్లిని కాపాడే యత్నంలో.. ఈ ఇద్దరూ స్వాతంత్ర్య పోరాటానికి ఎలా కనెక్ట్ అయ్యారు? అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ పాత్రలు ఈ ఇద్దరితో ఎలా కనెక్ట్ అయ్యాయి? వంటి హై ఓల్టేజ్ యాక్షన్ మరియు భావోద్వేగ సన్నివేశాల సమాహారమే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.

నటీనటులు:

రాజమౌళి ఈ కథకి చరణ్, తారక్‌లని ఎందుకు తీసుకున్నాడనేది సినిమా చూసే వారికి స్పష్టంగా అర్థమవుతుంది. ట్రైలర్‌లో చూపించినట్లుగా నిజంగా రెండు ఆయుధాలు వాటంతట అవే ఈ కథకి వచ్చి చేరాయి అని అనుకోవచ్చు. ఈ మధ్య ఇంటర్వ్యూలలో చెప్పినట్లుగా వారి స్నేహం ఈ సినిమాకి చాలా చక్కగా ఉపయోగ పడింది. ముందు అమాయకత్వంగా కనిపించే భీమ్, తర్వాత బెబ్బులిగా మారి చెలరేగిపోయే పాత్రలో అత్యద్భుతంగా తారక్ ఒదిగిపోయాడు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సమర్థుడు ఎన్టీఆర్. ఆ విషయం టాలీవుడ్‌కి తెలుసు. ఇప్పుడు అన్ని వుడ్‌లకి తారక్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా తారక్ మెప్పించాడు. ఈ సినిమా తారక్ కెరీర్‌ని ఒక మలుపు తిప్పుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. చరణ్ కూడా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా సెటిల్డ్ నటనతో మెప్పించడమే కాకుండా.. భీమ్‌కి సహకారం అందించే సన్నివేశాల్లో, అతనితో పోరాడే సన్నివేశాల్లో అత్యద్భుత నటనను కనబరిచాడు. అల్లూరిగా చరణ్ విజృంభించేశాడని చెప్పవచ్చు. చరణ్‌కి కూడా ఈ చిత్రం ఓ మైలురాయి. ఈ ఇద్దరి కథ చరిత్రలో నిలిచిపోతుంది. డ్యాన్స్ విషయంలో ఈ ఇద్దరికీ చెప్పేదేముంది.. అరిపించేశారు. అలాగే ఆలియా, అజయ్ దేవగన్‌ పాత్రలు కనిపించేది కొద్దిసేపే అయినా.. సినిమాపై వారి పాత్రలు ప్రభావితం చూపేవిగా ఉంటాయి. సముద్రఖనికి అలాగే రాహుల్ రామకృష్ణకి కూడా పవర్‌ఫుల్ పాత్రలు పడ్డాయి. శ్రియా, రాజీవ్ కనకాల వంటి వారు కొన్ని సీన్లకే పరిమితమయ్యారు. భీమ్ అంటే ఇష్టపడే బ్రిటీష్ యువతిగా ఓలివియా క్యూట్‌గా కనిపించింది. ఇంకా ఇతర పాత్రలలో ఎంత మంది నటించినా.. కేవలం రెండు సింహాలపైనే చూసే వారి దృష్టి ఉండేలా రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా తెరకెక్కించడంలో ప్రథమ పాత్ర వహించాయని చెప్పుకోవచ్చు. జక్కన్న చెక్కిన శిల్పానికి పూర్తి న్యాయం చేశారు సెంథిల్. తనకు రాజమౌళి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో.. ఈ సినిమా చూస్తే మరోసారి అర్థమవుతుంది. బ్రిటీష్ కాలం నాటి మూడ్‌ని పరిచయం చేయడంలో, అలాగే అబ్బుర పరిచేలా యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించడంలో సెంథిల్ కెమెరా పని తీరు భేష్. ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ సెట్స్ మరో హైలెట్. రాజమౌళి కలను.. తన సెట్స్‌లో దించేశాడు. శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ, ఫైట్స్ ఇలా అన్నీ ఈ సినిమాకి చక్కగా కుదిరాయి. మరో ప్రధాన హైలెట్ కీరవాణి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్. రాజమౌళికి కీరవాణి ఎంత ప్రత్యేకమో.. మరోసారి ఆ ప్రత్యేకతను కనబరిచారు కీరవాణి. ఎడిటింగ్ విషయంలో ముఖ్యంగా సెకండాఫ్‌లో ఇంకొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండవచ్చు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయి. ఇక మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్. కథకి అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్స్‌ పడ్డాయి. ఈ చిత్ర విజయంలో ఆయన కూడా తన మెరుపులను ప్రదర్శించారు. ఇలాంటి కథల్ని కూడా మనం క్రియేట్ చేయగలం అని నిరూపించారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఊహాజనితమైనదే అయినా.. ఈ కథని ఆయన మలిచిన తీరు అత్యద్భుతం. ఫైనల్‌గా దర్శకధీరుడు రాజమౌళి.. తనకు సాటి లేరని మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ సాక్షిగా చాటి చెప్పాడు. ఊహాజనితమైన కథని.. కలగా చేసుకుని, రెండు పదునైన ఆయుధాలతో ఆయన చేసిన యుద్ధం.. చరిత్రలో కొన్నాళ్ల పాటు నిలిచిపోతుంద నడంలో అస్సలు సందేహమే అవసరం లేదు. తనని జక్కన్న అని ఎందుకు అంటారో.. మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో రాజమౌళి.. వెండితెర సాక్షిగా నిరూపించారు.

విశ్లేషణ:

ఒక చిన్న పాయింట్ ఉంటే చాలు.. అత్యద్భుతమైన సినిమా తీయవచ్చు అనే దానికి ఉదాహరణ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. కథగా ఇది చిన్న పాప మల్లి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొదలవుతుంది కానీ, కదనరంగంలోకి రెండు సింహాలను దింపి.. వాటి తో ఎటువంటి బీభత్సం సృష్టించవచ్చో.. రాజమౌళి అది చేసి చూపించారు. మెగా, నందమూరి అభిమానులు మా హీరో అంటే మా హీరో అని చెప్పుకోవడానికి వీలు లేకుండా.. అందరినీ భీమ్, అల్లూరి పాత్రకి కనెక్ట్ చేసిన తీరుకి ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు.. హీరోలిద్దరికీ సరి సమానమైన పాత్రలను, సన్నివేశాలను సృష్టించి.. రాజమౌళి మెరుపులు మెరిపించాడు. తను బలంగా నమ్మే భావోద్వేగాలను చాలా చక్కగా రాబట్టగలిగాడు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఎలాంటి చిత్రం చేస్తారో.. అని ఊహించుకున్నవాళ్లకి దానిని మించిన చిత్రంతో.. ఇది తన రేంజ్ అని మరోసారి చాటిచెప్పాడు. నిజంగా తెలుగువాడు తలుచుకుంటే.. ప్రపంచమంతా నీరాజనాలు పలకాల్సిందే అనేలా.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి నిరూపించాడీ జక్కన్న. నిప్పు, నీరు అంటూ మొదలెట్టి.. ఇద్దరు హీరోలని పరిచయం చేసిన తీరు.. ప్రేక్షకులని థ్రిల్‌కి గురిచేస్తాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోలని కలిపి చేయించిన దోస్తీ, భీమ్‌కి రామరాజు సాయం చేసే విధానం అంతా హృదయాలను తాకుతూ నడుస్తుంది. కానీ ఆ దోస్తుల మధ్యే వైరం పుట్టించి.. వారిద్దరూ కలబడితే ఎలా ఉంటుందో చూస్తారా? అని ప్రేక్షకులలో ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేయడం జక్కన్నకే సాధ్యం. ఆ తర్వాత మళ్లీ వారిద్దరితో స్వాతంత్ర్య పోరాటం చేయించడం.. గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలతో కథని నడిపిన తీరు.. చూస్తున్న ప్రేక్షకులకి పండగే. ఇక రామరాజు, భీమ్ గురించి ఏం చెబుతాం.. ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్లుగా గర్జించారు. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కొద్దిగా సాగదీతగా అనిపిస్తాయి తప్ప.. సినిమా అంతా ఎలా ఊహించుకుని వెళతారో.. అలానే ఉంటుంది. ‘బాహుబలి’ కుంభస్థలమైతే.. ఈ రాముళ్లు అవలీలగా దానిని బద్దలు చేయడం ఖాయం. ఓవరాల్‌గా రాజమౌళి.. రామ్ చరణ్, రామారావులతో చేసిన విజువల్ వండర్ ఈ రౌద్రం, రణం, రుధిరం. వెండితెరపై చూడాల్సిన భావోద్వేగభరిత కళాఖండమిది. ఇక ఆలస్యమెందుకు?.. టికెట్స్ బుక్ చేసుకోండి.

ట్యాగ్‌లైన్: బాహుబలి.. కుంభస్థలం బద్దలైనట్లే..!
రేటింగ్: 3.5/5

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.