Health Tips: ఆధునిక జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లు,పని ఒత్తిడి, పెరుగుతున్న కాలుష్యం వంటి అనేక కారణాలతో మన శరీర జీవక్రియలను సమన్వయపరిచే థైరాయిడ్ గ్రంధి పనితీరులో లోపాలు తలెత్తి థైరాయిడ్ సమస్యకు కారణమవుతోంది.మన శరీరంలో అతి ముఖ్యమైన థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియలను సమన్వయపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సమస్య నుంచి రక్షణ పొందాలంటే ఈ వ్యాధి పైన కొంత అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండడం ఎంతో మంచిది.
ఈరోజు మనం థైరాయిడ్ వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రత తగ్గించుకోవడానికి రోజువారి దినచర్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.థైరాయిడ్ గ్రంథి శ్రవించే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిలో వ్యత్యాసం ఏర్పడితే హఠాత్తుగా శరీర బరువు పెరగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా తగ్గడం,అతిగా చెమటలు పట్టడం,తరచూ విరేచనాలు,విపరీతమైన ఒళ్లు నొప్పులు డిప్రెషన్, మానసిక సమస్యలు, రక్తహీనత, మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
థైరాయిడ్ వ్యాధి అయోడిన్ లోప వల్ల ఎక్కువ మందిని బాధిస్తుంది. కావున అయోడిన్ పుష్కలంగా లభించే అరటిపండ్లు,సముద్రపు చేపలు,క్యారట్, పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు,రాగులు వంటివి మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజి, ముల్లంగి, కాలీప్లవర్, బ్రకోలి
సోయాబీన్ ,రెడ్ మీట్ లాంటివి ఆహారంగా తక్కువ తీసుకోవాలి.మరియు కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉన్న టీ,కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి థైరాయిడ్ గ్రంధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది కావున మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, నడక, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది.